రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే, ఒక ముఖ్యమంత్రి పట్ల ఇంతటి ద్వేషం, కక్ష సాధింపుతత్వం ఉంటుందా అనిపిస్తుంది. తాజా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ముఖ్యంగా గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, వ్యవస్థల పేర్లను మార్చాలనే తపన చూస్తుంటే, వారిలో ఎంత రాజకీయ నిస్సిగ్గు ఉందో అర్థమవుతోంది.
ఎవరి కష్టంతో పుట్టిన బిడ్డకు తమ పేరు చెప్పుకోవడం అంటే సిగ్గులేదా? వైయస్ జగన్ గారు ఎంతో దార్శనికతతో ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ… ప్రజలకు సేవలను అత్యంత చేరువ చేసిన అద్భుతమైన పాలనా సంస్కరణ. ఆ వ్యవస్థ పుట్టుక, రూపకల్పన, అమలు పూర్తిగా వైయస్ జగన్ గారి ఆలోచన. కానీ, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఆ వ్యవస్థకు పేరు మార్చి, ‘స్వర్ణాంధ్ర కేంద్రాలు’గా మార్చాలని చూస్తోంది. పేర్లు మార్చడం ద్వారా ఆ ఘనత తమకు దక్కుతుందనే పగటి కలలు కంటున్నారు. పేరు మారినా, ప్రజల గుండెల్లో ‘సచివాలయం’ అంటే గుర్తొచ్చేది వైయస్ జగన్ గారి పాలనే!
నాల్గుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి పాలన చరిత్రలో నిలిచే అంశాలు ఏమున్నాయి? ఒక్క మంచి పనీ లేదు. ఆయన పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది కేవలం వెన్నుపోటు, దగా, మోసం, కుట్రలు, కుతంత్రాలు, అన్యాయాలు, దోపిడీలు, అరాచకాలు తప్ప మరొకటి లేదు. వ్యవస్థలను నాశనం చేయడంలో, అవినీతికి పాల్పడటంలో, తన రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడంలో తప్ప, ప్రజలకు మేలు చేసిన ఒక్క ఘట్టం కూడా ఆయన రాజకీయ ప్రస్థానంలో కనపడదు.
నిజమైన నాయకుడు, పాలనాదక్షుడు తనదైన ముద్రను కొత్త పథకాలతో, సంస్కరణలతో వేయాలి. కానీ, దానికి బదులుగా, గత ప్రభుత్వం చేసిన పనుల పేర్లు మార్చడం, వైయస్సార్ గారి పేరుతో ఉన్న పథకాలకు అడ్డు తగలడం ద్వారా, ఈ కూటమి ప్రభుత్వం తమ చేతగానితనాన్ని, రాజకీయ కుట్రలను ప్రజల ముందు ప్రదర్శిస్తోంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కేవలం పేర్లు మార్చినంత మాత్రాన చరిత్రను మార్చలేరు. వ్యవస్థలను విధ్వంసం చేసే ఈ కక్ష సాధింపు రాజకీయాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు.


