ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఉండి ఎమ్మెల్యేగా గెలిచి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కించుకున్న రఘురామకృష్ణంరాజుకు ఇప్పుడు సొంత పార్టీలోనే ప్రతిఘటన ఎదురవుతోంది. ఉండి నియోజకవర్గానికి చెందిన టిడిపి సీనియర్ నేత పొత్తూరి వెంకటేశ్వరరాజు మీడియా ముందుకు వచ్చి రఘురామకృష్ణంరాజుపై తీవ్ర ఆరోపణలు చేయడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
వెంకటేశ్వరరాజు తనకు డిప్యూటీ స్పీకర్ నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఈ విషయంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేస్తానని ఆయన ప్రకటించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మరింత చర్చనీయాంశమైంది.
రఘురామకృష్ణంరాజు రాజకీయ ప్రయాణం కూడా ఆసక్తికరంగానే ఉంది. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచిన ఆయన, అనంతరం ఆ పార్టీతో విభేదించి బయటకు వచ్చారు. తరువాత బీజేపీలో చేరినా, ఎంపీ టికెట్ దక్కకపోవడంతో చివరి నిమిషంలో టిడిపిలో చేరి ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి ఆయనకు టికెట్ ఇవ్వడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది.
ఇప్పటివరకు టిడిపికి కంచుకోటగా పేరుగాంచిన ఉండి నియోజకవర్గంలో ఈ తరహా విభేదాలు బయటపడటం పార్టీకి ఆందోళన కలిగిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలోనే ఈ వివాదం బయటపడటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాలపై టిడిపి హైకమాండ్ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.


