ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు త్వరలో సొంత పార్టీ ఏర్పాటు చేస్తానని సంకేతాలు ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. కొద్దికాలం క్రితమే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆశించిన స్థాయి పదవి లభించకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన వెంకటేశ్వరరావు, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నారు. డీజీపీగా ప్రమోట్ కావాల్సిన అవకాశాలు దక్కకపోవడమే కాకుండా, న్యాయపోరాటం అనంతరం పదవీ విరమణ రోజునే పోస్టింగ్ పొందడం ఆయనకు చేదు అనుభవంగా మారింది. ఈ నేపథ్యంలో రాజకీయంగా గుర్తింపు దక్కుతుందని భావించినా, అది సాధ్యం కాలేదన్న అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది.
వాస్తవానికి వెంకటేశ్వరరావు టీడీపీలో చేరాలని భావించినప్పటికీ, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి ఆశించిన స్పందన రాలేదన్నది ఆయన వాదన. దీంతో ప్రభుత్వం, కూటమిపై విమర్శలు పెంచుతూ కొత్త పార్టీ అంటూ హడావిడి చేస్తున్నారు. మరోవైపు, జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని పిరికి అంటూ విమర్శించడం రాజకీయ ఒత్తిడిగా మారిందని టాక్.
అయితే ఈ కొత్త పార్టీకి వాస్తవిక రాజకీయ ఉనికి ఉంటుందా? లేక చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే వ్యూహమా? అన్నది ఇప్పటికీ చర్చనీయాంశమే. రాజకీయంగా బలమైన ప్రత్యామ్నాయంగా కాకుండా, అసంతృప్తి వ్యక్తీకరణగానే ఈ ప్రయత్నం మిగిలిపోతుందన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తోంది.

