రైల్వేకోడూరు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ‘రాసలీలల’ గురించే చర్చ సాగుతోంది. ఒక మహిళా ఉద్యోగితో ఎమ్మెల్యే జరిపిన ఏకాంత సంభాషణలు, వీడియోలు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తుండటంతో నియోజకవర్గ ప్రతిష్ట మసకబారుతోంది.
బాధిత మహిళ ఒక్కోటిగా బయటపెడుతున్న వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే స్వయంగా కారు నడుపుతూ “నువ్వు లేకపోతే చచ్చిపోతాను” అంటూ సదరు మహిళను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తొలుత ఈ ఆరోపణలను తోసిపుచ్చినప్పటికీ, వరుస ఆధారాలు బయటకు వస్తుండటంతో ఎమ్మెల్యే ఆత్మరక్షణలో పడ్డారు.
ఈ వివాదం ముదిరినప్పటి నుండి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి, ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడ్డాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా, ప్రజాప్రతినిధి ఆచూకీ లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్యే తల్లి సదరు మహిళపై రూ. 25 కోట్ల బ్లాక్‌మెయిలింగ్ కేసు పెట్టగా, పోలీసులు వెంటనే స్పందించి నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అయితే బాధిత మహిళ జిల్లా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికీ కేసు నమోదు కాలేదని తెలుస్తోంది. అధికార పార్టీ ఒత్తిళ్లతో విచారణ ఏకపక్షంగా సాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి.
అసలు ఈ ‘రాసలీలల’ కథ ఎక్కడ ముగుస్తుంది? ఇంకా ఎన్ని వీడియోలు బయటకు వస్తాయి? చట్టం తన పని తాను చేసుకుపోతుందా లేక రాజకీయ పరపతితో ఈ కేసు నీరుగారిపోతుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

