ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి క్రెడిట్ యుద్ధం చెలరేగింది. విశాఖపట్నం సమీపంలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఈసారి కేంద్ర బిందువుగా మారింది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టు పునరుద్ధరించబడి, వేగంగా నిర్మాణ పనులు సాగాయి. జగన్ సర్కార్ కాలంలోనే సుమారు 80 శాతం పనులు పూర్తి అయ్యాయని ప్రభుత్వ నివేదికలు, అధికార వర్గాలు అప్పట్లో వెల్లడించాయి. విమానాశ్రయం రన్‌వే, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ వంటి కీలక సదుపాయాలు జగన్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి.
అయితే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం, మిగిలిన 10–15 శాతం పనులు పూర్తి చేసి ప్రాజెక్ట్‌ను ప్రారంభ దశకు తీసుకెళ్లింది. ఈ సందర్భంగా ప్రభుత్వం, పార్టీ మీడియా వర్గాలు దీనిని “చంద్రబాబు సాఫల్యం”గా ప్రదర్శిస్తూ, ప్రపంచ స్థాయి విమానాశ్రయంగా అభివర్ణిస్తున్నాయి.
దీనిపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. సోషల్ మీడియాలో “జగన్ చేసిన పనిని బాబు హైజాక్ చేశాడు” అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి బేస్ వర్క్, కాంట్రాక్టులు, భూసేకరణ, ఫండింగ్ అన్నీ జగన్ సర్కారే చేసింది. ఇప్పుడు కేవలం తుది టచ్ ఇచ్చి టీడీపీ డబ్బా కొడుతోంది” అంటూ వైసీపీ కార్యకర్తలు వాదిస్తున్నారు.
ఇక టీడీపీ వర్గాలవైపు చూస్తే, వారు మాత్రం భిన్నమైన వాదన చేస్తున్నారు. “జగన్ సర్కార్ ఆలస్యం చేసింది. ప్రాజెక్ట్ సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. చంద్రబాబు తిరిగి స్పీడ్ ఇచ్చి పూర్తి చేశాడు” అని చెబుతున్నారు.
కానీ, ప్రజల దృష్టిలో మాత్రం భోగాపురం విమానాశ్రయం రాజకీయ క్రెడిట్ పోటీకి వేదికగా మారిపోయింది. ఎవరి పాలనలో ఎక్కువ భాగం పూర్తయిందన్నదానికంటే, ఇప్పుడు ప్రజలు ఎదురుచూస్తున్నది – ఈ విమానాశ్రయం ఆపరేషనల్ అవ్వడం ద్వారా ఆ ప్రాంతానికి ఎలాంటి ఆర్థిక అభివృద్ధి వస్తుందనేదే.
మొత్తంగా జగన్ వేసిన పునాది మీద బాబు తుది రంగులు పూయించిన ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కంటే రాజకీయ ప్రతిష్టల పోటీగా మారిపోతోందన్నది వాస్తవం.