ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. చదివి, పరీక్షలు రాసి, పాసై ఉద్యోగం సంపాదించడం కష్టమని, అందుకే ఐఏఎస్ (IAS) అధికారులను నియంత్రించే (కంట్రోల్) స్థాయికి రావాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీశాయి.
ఒక బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. : “చదివి, కష్టపడి పరీక్ష రాసి, జాబ్ కొట్టడం, పాస్ కావడం కష్టం. అంత కష్టపడి ఐఏఎస్ అయ్యే కంటే, రాజకీయ నాయకుడిగా అయ్యి, వారి (ఐఏఎస్ అధికారుల) పైన కంట్రోల్ చేయడం బెటర్ అనిపించింది. అందుకే రాజకీయాల్లోకి వచ్చాను” అని చంద్రబాబు అన్నారు. అంటే, అత్యంత కఠినమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలను ఎదుర్కొని ఐఏఎస్ కావడానికి బదులు, సులువుగా రాజకీయాల్లోకి వచ్చి, పాలనా వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఐఏఎస్ అధికారులనే నియంత్రించే శక్తిని పొందాలని తాను భావించినట్లు ఆయన చెప్పకనే చెప్పారు.
సీఎం స్థాయి వ్యక్తి, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ కామెంట్స్‌ను చంద్రబాబు నాయుడు ఆత్మవిశ్వాసం, రాజకీయ చతురతకు నిదర్శనంగా చూస్తుంటే, మరికొందరు చదువు, కష్టానికి విలువ లేకుండా మాట్లాడారని విమర్శిస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీలు ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్నాయి. కష్టపడి చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులను, నిరుద్యోగులను ముఖ్యమంత్రి చిన్నచూపు చూశారని, ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల ఆకాంక్షను కించపరిచారని ఆరోపిస్తున్నారు.
ఈ సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో పాలనాధికారం, రాజకీయ నాయకత్వం-అధికార యంత్రాంగం మధ్య సంబంధాలపై కొత్త చర్చకు తెరలేపాయి.

