గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ చిత్రాలను ప్రదర్శించిన కేసులో అరెస్టయిన సినీ నటుడు పోసాని కృష్ణమురళితో సీఐడీ పోలీసులు ఫోటోలు దిగడం వివాదాస్పదంగా మారింది.
గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు, ఆయన్ను కర్నూలు నుంచి గుంటూరుకు తీసుకొచ్చారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను గుంటూరు జైలుకు తరలించారు.
పోసానిని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోర్టును కోరగా, మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు అనుమతి లభించింది. విచారణ అనంతరం వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ కు తరలించి, తిరిగి జైలుకు పంపుతుండగా సీఐడీ పోలీసులు ఆయనతో ఫోటోలు దిగారు.
పోసాని జైలులోకి వెళ్లే ముందు, సీఐడీ అధికారులు ఆయనను ఫోటో కోసం అభ్యర్థించారు. ఒక పోలీసు తన ఫోన్ ను సహోద్యోగికి ఇచ్చి పోసాని పక్కన నిలబడి ఫోటో దిగగా, మరొక అధికారి కూడా అదే విధంగా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, రిమాండ్ ఖైదీతో పోలీసులు ఫోటోలు దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, పోసాని బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఆయనకు ఈ నెల 26 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.