అధికార కూటమిలోని ఇద్దరు కీలక నేతలు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (టీడీపీ), విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు (బీజేపీ) నడిరోడ్డుపైనే తీవ్ర వాగ్వాదానికి దిగడం స్థానికంగా కలకలం సృష్టించింది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ (ఫిలిం క్లబ్) లీజు వ్యవహారమే వీరిద్దరి మధ్య ఘర్షణకు దారితీసినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే, ఫిలిం నగర్ క్లబ్ లీజు విషయంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తన నియోజకవర్గానికి సంబంధించిన అంశం కానప్పటికీ జోక్యం చేసుకుని కలెక్టర్‌ను కలవడంపై గంటా శ్రీనివాసరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఇద్దరు నేతలు ఎదురుపడినప్పుడు వాగ్వాదం చోటుచేసుకుంది.
“నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా ఎలా జోక్యం చేసుకుంటారు? మీ ధోరణి ఏమాత్రం బాగాలేదు, ఇది సరికాదు” అంటూ గంటా శ్రీనివాసరావు నడిరోడ్డుపైనే విష్ణుకుమార్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
దీనిపై విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ, ఫిలిం క్లబ్ లీజు వ్యవహారంపై కలెక్టర్‌ను కలిసే సమయంలో గంటా శ్రీనివాసరావు అందుబాటులో లేకపోవడం వల్లే తాను కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, విష్ణుకుమార్ రాజు వివరణతో సంతృప్తి చెందని గంటా శ్రీనివాసరావు, తన నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా జోక్యం చేసుకుంటే సహించేది లేదని గట్టిగా హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.
కూటమిలో భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, బీజేపీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రజల సమక్షంలోనే ఇలా వాగ్వాదానికి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఫిలిం నగర్ క్లబ్ లీజు వ్యవహారంపై వీరిద్దరి మధ్య విభేదాలు ఇప్పటికే ఉన్నాయని, తాజా సంఘటనతో అవి బహిర్గతమయ్యాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం కూటమిలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.