ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమికి కొత్త చికాకులు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతమంది టిడిపి ఎమ్మెల్యేల ప్రవర్తనపై సీరియస్‌గా ఉన్నారని తెలుస్తోంది. అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తికావడంతో పరిపాలనపై దృష్టి పెట్టిన ఆయనకు, కొన్ని అనవసరమైన వివాదాలు ఇబ్బందులు తెస్తున్నాయి. జిల్లాల వారీగా కొందరు ఎమ్మెల్యేలపై ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో, మారని వారిని మార్చేస్తానని ఆయన హెచ్చరించినట్లు సమాచారం.
ఇదే సమయంలో బిజెపి నేతల వైఖరి కూడా కూటమిలో అసౌకర్యం కలిగిస్తోంది. బిజెపి ఎంపీ సీఎం రమేష్ కంపెనీపై అదే పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు దాడి చేయడం పెద్ద వివాదంగా మారింది. అంతకుముందు కూడా పార్టీ అంతర్గతంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
జనసేన వైపు కూడా అంతా సవ్యంగా లేవు. కొన్ని నియామకాల విషయంలో నేతల మధ్య విభేదాలు తలెత్తగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రమశిక్షణపై పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే కొందరిపై చర్యలు తీసుకోవడం కూడా జరిగింది.
మొత్తం మీద మూడు పార్టీలలోనూ పెరుగుతున్న అంతర్గత తగాదాలు కూటమి సమన్వయానికి సవాలు అవుతున్నాయి. మొదటినుంచే సమస్యలను అరికట్టకపోతే, ఇవి భవిష్యత్తులో పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది.