ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వమే, ఇప్పుడు ప్రజల ప్రాణాలు తీసే నకిలీ మద్యం దందాలో భాగమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ, రవాణా, విక్రయాలు భయంకర స్థాయికి చేరాయి. దీనివల్ల ఎన్ని అమాయక ప్రాణాలు బలైపోయాయో ఎవరికీ తెలియదు. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకుంటూ బాధ్యతను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రజల పన్నుల డబ్బుతో నడిచే ప్రభుత్వ యంత్రాంగమే ఈ మాఫియాకు మద్దతు ఇస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. “పుష్ప” సినిమాలో లాగా — పాల వ్యాన్లలో నకిలీ మద్యం తరలింపు జరుగుతుందనే షాకింగ్ అంశాలు బయటకు వస్తున్నాయి. ఎంత కట్టుదిట్టమైన తనిఖీలు ఉన్నా, ఈ వ్యాపారం ఆగడం లేదు. ఎందుకంటే దానికీ రాజకీయ పరిరక్షణ ఉందని ప్రజలలో గుసగుసలు.
ఇక జర్నలిజం పేరుతో నడిచే కొందరు మీడియా పెద్దలు ఈ దందాలో భాగమైన నాయకులను కాపాడేందుకు ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి న్యాయం కాదు. నిజం చెప్పే దమ్ము లేకుండా పక్షపాతంగా వ్యవహరించే మీడియా వల్లే ప్రజలు మోసపోతున్నారు.
నకిలీ మద్యం కేసుల్లో టిడిపి నేతలు లేదా అధికార పార్టీకి చెందిన ప్రముఖులు దొరికిపోతే “ఇది పెద్దిరెడ్డి కుటుంబం చేస్తున్న కుట్ర” అంటూ అబద్ధపు ప్రచారం మొదలవుతుంది. కానీ, నిజంగా ఎవరు దోషులన్నది ప్రజలకు స్పష్టమవుతోంది.
అదే ఒక సామాన్యుడు లేదా ప్రతిపక్ష నేత ఈ కేసులో చిక్కుకుంటే వెంటనే అరెస్టులు, కేసులు, మీడియా ట్రయల్ జరుగుతుంది. కానీ అధికార పార్టీ నాయకులపై మాత్రం ‘ఇంక్వైరీ జరుగుతోంది’ అని చెప్పి సస్పెన్షన్‌తో సరిపెడుతున్నారు. ఇది న్యాయమా? ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రజల ప్రాణాలపై జరుగుతున్న ఈ ఆట ఆగాలి. నకిలీ మద్యం మాఫియాను కఠినంగా అణచివేయాలి. ఎవరు పాలుపంచుకున్నా, రాజకీయాలు పక్కనబెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాణాల కంటే పెద్దది ఏ రాజకీయమూ కాదు.