తెలుగుదేశం (టీడీపీ) పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేతలు కొందరు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుని తమ వారసులకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. అశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడు వంటి నేతలు ఇప్పటికే తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకురాగా, తాజాగా ఆ జాబితాలోకి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా చేరినట్లు ప్రచారం జరుగుతోంది.
వచ్చే ఎన్నికల నాటికి తాను క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలగి, తన కుమారుడు గంటా రవితేజను పోటీ చేయించాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల తన పుట్టినరోజు వేడుకల్లో సైతం గంటా ఇదే తరహా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ విషయమై పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రకాశం జిల్లా నుంచి వ్యాపారరీత్యా విశాఖలో అడుగుపెట్టిన గంటా శ్రీనివాసరావు విశాఖ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన ఒకసారి ఎంపీగా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి డబుల్ హ్యాట్రిక్ విజయం సాధించిన నేతగా గుర్తింపు పొందారు.
గత ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుపై 90 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచినా, వివిధ సమీకరణల కారణంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.
ప్రస్తుతం భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు కంటే ఆయన కుమారుడు గంటా రవితేజ చాలా చురుకుగా ఉంటున్నారని, ఆయనే ఒక విధంగా షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో నారా లోకేష్ టీమ్‌లో రవితేజ ఉండబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోకేష్‌కు మద్దతుగా నగరవ్యాప్తంగా భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడంలో రవితేజ చొరవ చూపారు.
తన కుమారుడిని ప్రమోట్ చేసే పనిలో ఉన్న గంటా శ్రీనివాసరావు, ఇటీవల పుట్టినరోజు వేడుకల్లో రవితేజ పోటీపై దాదాపుగా క్లారిటీ ఇవ్వడంతో… వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి రవితేజ పోటీ చేయడం దాదాపు ఖాయమనే సంకేతాలు టీడిపి శ్రేణుల్లో బలంగా వెళ్తున్నాయి.


