ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎండగట్టారు. రాష్ట్రంలో ఏ పరిశ్రమ నడవాలన్నా ఏ జిల్లాలో వ్యాపారం చేయాలన్నా టీడీపీ కూటమి నేతలకు ‘కప్పం’ కట్టాల్సిందేనని ఆయన మండిపడ్డారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలను, బినామీలకు భూములను ధారాదత్తం చేయడాన్ని ఆయన చీల్చి చెండాడారు.
పారిశ్రామికీకరణలో ఏపీ దూసుకుపోతోందంటూ ‘ఎల్లో మీడియా’లో వస్తున్న వార్తలు కేవలం ప్రచారం కోసమేనని జగన్ విమర్శించారు. చంద్రబాబు తన హయాంలో పెద్ద కంపెనీలకు 99 పైసలకే భూమి ఇస్తామంటూ ఊరిస్తారని, కానీ ఆ ముసుగులో తన అనుయాయులకు, బినామీలకు కారుచౌకగా భూములను కట్టబెడుతున్నారని ఆరోపించారు.
విశాఖపట్నంలో గతంలో జరిగిన భూ కేటాయింపులను ఉదాహరణగా చూపుతూ జగన్ సంచలన విషయాలను వెల్లడించారు.దాదాపు రూ. 2,000 కోట్ల విలువైన 14 ఎకరాల భూమిని ఎటువంటి టెండర్లు, వేలం లేకుండా లులూ మాల్‌కు 99 ఏళ్ల లీజుకు ఇచ్చారని గుర్తు చేశారు. ఇదే లులూ గ్రూప్ గుజరాత్ రాష్ట్రంలో రూ. 515 కోట్లు వెచ్చించి భూమిని కొనుగోలు చేసి మాల్ నిర్మిస్తోందని, కానీ ఏపీలో మాత్రం ప్రజల ఆస్తిని చంద్రబాబు ఉచితంగా ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ఖజానాకు భారీ గండి కొట్టడమేనని ఆయన ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ప్రస్తుతం పారిశ్రామికవేత్తలు భయం నీడలో బతుకుతున్నారని జగన్ పేర్కొన్నారు. “ప్రతి జిల్లాలోనూ టీడీపీ నేతల వేధింపులు పెరిగిపోయాయి. పరిశ్రమలు పెట్టుకోవాలంటే ముందుగా ‘కప్పం’ కట్టాలనే నిబంధన పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పెట్టుబడులు ఎలా వస్తాయి?” అని ఆయన నిలదీశారు.
అభివృద్ధి ముసుగులో సాగుతున్న ఈ భూ దందాను ప్రజలు గమనిస్తున్నారని.. బినామీల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే సహించేది లేదని వైఎస్ జగన్ హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే ఈ వివక్షాపూరిత కేటాయింపులపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.


