ప్రాంతీయ పార్టీ అధినేతల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్నంత ప్రజాదరణ మరే నాయకుడికి కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్సార్సీపీ అధినేతకు, ఇంత తక్కువ సమయంలోనే తిరిగి విపరీతమైన జనాదరణ లభించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ పెరుగుతున్న ఆదరణ రాజకీయ ప్రత్యర్థుల్లో గుండె దడ పుట్టిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
జగన్ స్వతహాగా మాస్ లీడర్, ఆయన బలం ప్రజలే. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలతో కొంత దూరం పాటించడం వల్లే ఎన్నికల్లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందనే చర్చ కూడా ఉంది. అయితే, అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలనే సూత్రాన్ని జగన్ పాటిస్తున్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి.
నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు హైదరాబాద్ వెళ్లిన జగన్‌కు భారీ జనాదరణ లభించింది. ఈ మధ్యకాలంలో ఆయనకు మళ్లీ పూర్వపు ఆదరణ దక్కుతోందని రాజకీయ వర్గాలు పసిగట్టాయి. అందుకే, కొందరు వ్యతిరేక మీడియా సంస్థలు మూడు రోజుల ముందు నుంచే ఆయన పర్యటనపై ప్రతికూల ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అయితే, ఈ ప్రతికూల ప్రచారమే జగన్‌కు మరింత రాజకీయంగా లాభిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జనాదరణ లేని నాయకుడి రాజకీయ జీవితం అస్తమిస్తుంది. కానీ, జగన్‌కు లభిస్తున్న ఈ ఆదరణ ఉదయిస్తున్న సూర్యుడిని తలపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై కనీసం ఏడాదిన్నర కూడా కాకముందే, పొరుగు రాష్ట్రమైన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జగన్‌కు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు రావడం సాధారణ విషయం కాదు.
హైదరాబాద్‌లో జగన్‌కు పోటెత్తిన జనం వైఎస్సార్సీపీలో జోష్ నింపగా, ముఖ్యంగా టీడీపీలో భయాన్ని నింపింది. జనంలో మళ్లీ జగన్‌పై మోజు కనిపిస్తోందన్న చర్చకు ఇది తెరలేపింది. ఈ జనాదరణ కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని, వ్యతిరేకతను కూడా ప్రతిబింబిస్తోందని విశ్లేషకుల అభిప్రాయం. కూటమి పాలన ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందనేందుకు ఈ మద్దతే నిదర్శనమని వారు పేర్కొంటున్నారు.
జగన్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఏపీలో జగన్ పాదయాత్ర చేపడితే, జనం పోటెత్తడం ఖాయమని రాజకీయ పండితులు అంటున్నారు. ఈ ప్రజాదరణే జగన్‌కు వెయ్యి ఏనుగుల బలం, కూటమిపై పోరాటానికి ప్రజలు ఇస్తున్న కొండంత మద్దతుగా భావించవచ్చు.

