టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నాయకుడు. యాభై ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం కలిగిన ఆయన ఎన్నో సార్లు జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించారు. యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీయే కన్వీనర్‌గా పనిచేసిన ఆయన రాజకీయ చరిత్రలో ముద్ర వేశారు.
అలాంటి సమయంలో, తాజాగా నారా లోకేష్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బాబు ప్రధాని పదవి ఆశిస్తారా? అనే ప్రశ్నకు ఆయన “అలాంటి ఆలోచనలు లేవు, ఆయన రెండు కళ్ళూ ఏపీ పైనే ఉన్నాయి” అని చెప్పడం సానుకూలంగానే ఉన్నా, “మేము గల్లీ లీడర్లం, మా రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యత” అన్న మాట వివాదాస్పదమైంది.
ఇంకా 2019లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను కలుపుకున్న నిర్ణయాన్ని “మనుషులం తప్పులు చేస్తూంటాం” అని లోకేష్ చెప్పడం, టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు రావడమే తప్పు అన్న సంకేతం ఇస్తుందా? అనే ప్రశ్నలను తెరపైకి తెచ్చింది.
ఫలితంగా, ఎన్డీయేపై నిబద్ధతను చూపే ప్రయత్నంలో లోకేష్ అనుకోకుండా చంద్రబాబు రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశ్లేషకుల దృష్టిలో, ఇది లోకేష్ తడబాటు వ్యాఖ్యల కిందికి వస్తుందనడం తప్పు కాదు.
మొత్తంగా, బీజేపీ పట్ల విధేయతను నిరూపించే క్రమంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు, టీడీపీ భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై కొత్త చర్చకు దారితీస్తున్నాయి.