ఆముదాలవలస టిడిపి ఎమ్మెల్యే కూన రవికుమార్ చుట్టూ నిన్నంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేగింది. వైసీపీ సోషల్ మీడియా “ట్రూత్ బాంబు” పేరుతో విడుదల చేసిన వీడియో, ఫోటోలు సంచలనంగా మారాయి. ఇందులో రవికుమార్ మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారన్న ఆరోపణలు వినిపించాయి. కొన్ని ఫోటోలు కూడా బయటకు రావడంతో మీడియా విపరీతంగా ప్రచారం చేసింది.
అయితే ఈ ఆరోపణలు వెలుగులోకి రావడం టిడిపికి ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా అధికారంలో కొత్తగా అడుగుపెట్టిన కూటమి ప్రభుత్వానికి ఇది పెద్ద సమస్యగా నిలిచింది. దీనితోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి, రవికుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. కానీ అంతర్గతంగా రవికుమార్‌ను ఆయనవాళ్లే బలి చేశారా అన్న చర్చ కూడా సాగుతోంది.
సమాచారం ప్రకారం—రవి కుమార్ కేజీబీవీ ఉద్యోగులతో కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడుతున్నప్పుడు, కొంతమంది స్క్రీన్‌షాట్లు తీసి వైసీపీ శిబిరానికి అందించారట. దొరికిన ఆ ఆధారాలపై వైసీపీ రెచ్చిపోయి, కేజీబీవీ ప్రిన్సిపల్‌ను కూడా తమ చానళ్లలో మాట్లాడించింది. దీంతో రవికుమార్ పూర్తిగా రక్షణాత్మక స్థితిలోకి వెళ్లిపోయారు.
ఇక రవికుమార్ వాదన వేరు. కేజీబీవీ స్కూల్స్‌లో అవినీతి, అక్రమాలపై తాను ప్రశ్నించానని, అందుకే ప్రిన్సిపాల్ వైసీపీ నేతలతో కలిసి తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. తల్లికి వందనం కార్యక్రమం సందర్భంగా మూడువురు ప్రిన్సిపల్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ చేయాలనుకున్నానని, కానీ దానిని వక్రీకరించి తనను తప్పుపట్టేలా ఫేక్ ఫోటోలు తయారు చేశారని ఆరోపించారు.
అయినా, రాజకీయంగా రవికుమార్ నష్టపోయారన్నది వాస్తవం. ఒక్కరోజులో ఆయన ఇమేజ్ గణనీయంగా దెబ్బతింది. ప్రస్తుతం ఆయన ఏమి చెప్పినా అది పెద్దగా ఉపయోగపడదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తం మీద కూన రవికుమార్ వ్యవహారం వైసీపీకి ఆయుధంగా మారింది. ఇక ఆయన నిజంగా బలి అయ్యారా లేక తప్పు చేశారా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.