ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఆసక్తికర పరిణామాలకు వేదిక అవుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరీతో సభలో ప్రతిపక్ష స్వరం వినిపించకపోవడంతో కూటమి ఎమ్మెల్యేలే మంత్రులను నిలదీస్తున్నారు. ప్రజా సమస్యల రూపంలో అడిగే ఈ ప్రశ్నలు ఇప్పుడు కూటమి భవిష్యత్తుపై అనుమానాలు రేపుతున్నాయి.
ఇటీవల టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను నేరుగా ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. అలాగే రేషన్ బియ్యం మాఫియాపై టిడిపి సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు పౌరసరఫరాల శాఖ మంత్రిని ఇబ్బందుల్లోకి నెట్టాయి. మరోవైపు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రహదారులపై టిడిపి మంత్రులను నిలదీయడం విశేషం.
ఇవి నిజంగా ప్రజా సమస్యలపై ప్రశ్నలా? లేక కూటమి లోపల విభేదాల సంకేతాలా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అధికార కూటమి సమన్వయం నిలకడగా కొనసాగుతుందా లేదా అనేది రాబోయే రోజులు చెప్పాల్సి ఉంది.