మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలంలోని వడ్డేశ్వరం గ్రామంలో దళిత కుటుంబం ఎదుర్కొంటున్న అన్యాయం చర్చనీయాంశమైంది. స్థానిక టీడీపీ నాయకుల మోసం కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న బడిపాటి మనిషా–సిసింద్రీ దంపతులు ఇప్పటికీ చెక్కు కోసం తిరుగుతూనే ఉన్నారు.
అకాలంలో పుట్టిన పాపకు చికిత్స చేయడానికి దంపతులు అప్పులు చేసి సుమారు 10 లక్షలు ఖర్చు చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం కోసం స్థానిక టీడీపీ నాయకులను సంప్రదించగా, వైసీపీ వారికి ఎందుకు చేయాలి అంటూ మొదట నిరాకరించారని, ఆపై పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే సహాయం అందుతుందని షరతు పెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
దిక్కుతోచని పరిస్థితిలో సభ్యత్వం తీసుకున్నా, వాగ్దానాలు గాల్లో కలిసిపోయాయి. ప్రజాదర్బార్‌లో నారా లోకేష్ సానుకూలంగా స్పందించి సహాయం చేస్తానని హామీ ఇచ్చినా.. ఇప్పటివరకు చెక్కు అందలేదని వారు వాపోతున్నారు.
ప్రచారం మాత్రం వైసీపీ కుటుంబాలకు కూడా అండగా ఉంటానని లోకేష్ చెబుతున్నా, వాస్తవంలో బాధిత కుటుంబం ఇంకా న్యాయం కోసం తలుపుతడుతూనే ఉంది. కనీసం ఇప్పటికైనా ఆ దళిత కుటుంబానికి హామీ ఇచ్చిన సహాయం అందించాలని ఆ తల్లి వేడుకుంటోంది.