తాడిపత్రిలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దారెడ్డి ఈరోజు తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయగా, ఈ సమావేశానికి భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చాయి.
పెద్దారెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు సమావేశానికి హాజరయ్యారు. తమ స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి బయలుదేరిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రిలో భారీగా మోహరించిన పోలీసులు, వైఎస్సార్‌సీపీ సమావేశానికి అనుమతి ఉన్నప్పటికీ, పెద్దారెడ్డికి మాత్రం అనుమతి లేదని తెలిపారు. దీంతో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దారెడ్డి మినహా మిగిలిన వైఎస్సార్‌సీపీ నాయకులు సమావేశానికి హాజరుకావచ్చని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
తనపై పోలీసులు ఆంక్షలు విధించడంపై కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో ఉండేందుకు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, పోలీసులు తనను అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నన్ను చూసి భయపడుతున్నారు. అందుకే పోలీసుల ద్వారా నన్ను అడ్డుకుంటున్నారని” ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు జేసీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో తిమ్మంపల్లి గ్రామం నుంచి తాడిపత్రి వరకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.