ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రస్తుతం విస్తృత చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా మహిళల కోసం ప్రారంభించిన ఈ సదుపాయం చాలా మందికి ప్రయోజనకరంగా మారింది. అయితే కొంతమంది దీన్ని సరదా కోసం వినియోగిస్తూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఇటీవల అనంతపురం జిల్లాలో ఓ మహిళ చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె బస్‌లో కూర్చుని మాట్లాడుతూ – “అమ్మకు కావలసిన కట్టుపొడి, ఆకులు తీసుకెళ్లడానికి ఫ్రీగా తాడిపత్రి నుంచి అనంతపురానికి వచ్చాను” అని చెప్పడం విశేషం. దీనిని చూసిన నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.
కొంతమంది దీన్ని సరదాగా తీసుకుంటూ లైక్‌లు, షేర్‌లు చేస్తుండగా, మరికొందరు మాత్రం సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని అవసరాల కోసం వినియోగించుకోవాలని, సరదా కోసం దుర్వినియోగం చేయొద్దని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రభుత్వం అందిస్తున్న ఈ ఫ్రీ బస్ పథకం నిజంగా పేద మహిళలకు, విద్యార్థినులకు, ఉద్యోగాలకు వెళ్లే వారికి పెద్ద సహాయంగా మారుతోంది. అయితే దీన్ని వినోదం కోసం వాడటం కన్నా, అవసరాల కోసం ఉపయోగించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.