తెలుగుదేశం పార్టీ కి చెందిన ఓ నాయకుడి వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఒక మహిళపై టీడీపీ నేత సోమ్లా నాయక్ తీవ్ర స్థాయిలో బూతులతో రెచ్చిపోయిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.
కదిరికి చెందిన ఓ మహిళ టీడీపీ నేత సోమ్లా నాయక్ వద్ద కొంత నగదు అప్పుగా తీసుకున్నారు. తాజాగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా సదరు మహిళ అప్పునకు సంబంధించిన వడ్డీని సకాలంలో చెల్లించలేకపోయారు. దీంతో ఆగ్రహించిన సోమ్లా నాయక్, ఆ మహిళను అత్యంత దారుణమైన భాషలో, బూతులతో దూషించినట్లు ఆడియో రికార్డింగ్‌లో స్పష్టంగా వినిపిస్తోంది.అధిక వడ్డీలకు అప్పులిచ్చి, వడ్డీ చెల్లించలేదనే కారణంతో మహిళపై ఇలా దుర్భాషలాడటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఆడియో లీక్ కావడంతో మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన టీడీపీ నేత సోమ్లా నాయక్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని పలు మహిళా సంఘాలు మరియు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై టీడీపీ అధిష్టానం ఇంకా స్పందించాల్సి ఉంది.


