ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యం తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం జిల్లా, చోడవరం మండలం, రామజోగిపాలెం గ్రామంలోని స్థానిక టీడీపీ నాయకుడు ఒకరు ఏకంగా ఒక పంచాయతీ కార్యదర్శిపైనే ఫోన్‌లో నానా దుర్భాషలాడి, బెదిరింపులకు దిగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
చాకిపల్లి పంచాయతీకి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి అప్పలస్వామి , చాకిపల్లి, రామజోగిపాలెం గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో, రామజోగిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రొంగలి వెంకటరమణ, కార్యదర్శికి ఫోన్ చేసి అధికార మదంతో రెచ్చిపోయారు.
“నువ్వు ఎవడివిరా… నీకు నచ్చినట్టు పనిచేస్తే కుదరదు..మేము చెప్పిందే చేయాలి… ఇది మా ప్రభుత్వం.నేను చెప్పిన వారి పేర్లే నమోదు చేయాలి…నువ్వు ఇక్కడ ఎలా పనిచేస్తావో చూస్తాం… నీ అంతు చూస్తాను…” అంటూ కార్యదర్శిని తీవ్రంగా బెదిరించారు.
కార్యదర్శి అప్పలనాయుడు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా, టీడీపీ నాయకుడు వెంకటరమణ వినకుండా నోటికి వచ్చినట్టుగా మాట్లాడారు.
ఈ ఘటనతో కార్యదర్శి అప్పలనాయుడు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ దుర్భాషలు, బెదిరింపులపై ఆయన ఎంపీడీవోకు మౌఖికంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
గ్రామస్థాయిలో టీడీపీ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం, తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ‘కూటమి ప్రభుత్వం’ దురాగత పాలనకు అద్దం పడుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో సైతం రాజకీయ జోక్యం, దౌర్జన్యం చేయడం పట్ల ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

