తెలుగుదేశం పార్టీ (టీడీపీ)పై మరోసారి తీవ్ర విమర్శలు వినిపించాయి. తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ వెంకటకృష్ణ చానెల్ డిబేట్‌లో పాల్గొని టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డిబేట్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. వెంకటకృష్ణ మాట్లాడుతూ “టీడీపీ ఒంటినిండా లిక్కర్ కంపు కొడుతోంది. ఇది చేసింది ఒక్కరు ఇద్దరు కాదు. రెడ్డి, చౌదరీలు లాంటి పెద్ద నేతలే లిక్కర్ స్కాంలలో ఇరుక్కున్నారు. టీడీపీ ఇప్పుడు ఈ మచ్చను భరించాల్సిందే. సమాధానం చెప్పుకోవాల్సిందే” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా ఆయన కొనసాగిస్తూ “ఈ కల్తీ సారాయి స్కాంలు పార్టీని దెబ్బతీస్తున్నాయి. ప్రజల ముందు టీడీపీకి ఇప్పుడు పెద్ద సవాలు ఇదే. ఈ ప్రచారాన్ని కౌంటర్ చేయాలా, లేక పట్టించుకోకుండా వదిలేయాలా అన్నది టీడీపీ ఆలోచించాలి” అని సూచించారు. వెంకటకృష్ణ వ్యాఖ్యల్లో ముఖ్యంగా పార్టీ నాయకత్వం బాధ్యత ప్రస్తావన చర్చనీయాంశమైంది. ఆయన మాట్లాడుతూ “ఒకరో ఇద్దరో చేసేదానికి మొత్తం పార్టీ బలి అవ్వాల్సి వస్తోంది. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, అలాగే చంద్రబాబు దీనిపై బహిరంగంగా సమాధానం ఇవ్వాలి. లేదంటే టీడీపీకి తగిన గుణపాఠం తప్పదు,” అని కఠినంగా హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొందరు వెంకటకృష్ణ మాటలకు మద్దతు ఇస్తూ టీడీపీని ప్రశ్నిస్తుండగా.. మరికొందరు ఆయన వ్యాఖ్యలను రాజకీయపరమైన అజెండాగా కొట్టిపారేస్తున్నారు. ఇక టీడీపీ వర్గాల్లో మాత్రం ఈ ఆరోపణలకు ఎలా స్పందించాలన్న దానిపై ముమ్మర చర్చలు నడుస్తున్నాయి. పార్టీ ప్రతినిధులు త్వరలోనే అధికారికంగా స్పందించే అవకాశం ఉందని సమాచారం. మొత్తం మీద ఏబీఎన్ లైవ్‌లో వెంకటకృష్ణ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు టీడీపీకి మరో తలనొప్పిగా మారాయి.