తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే టికెట్ల వ్యవహారం మరోసారి కలకలం రేపింది. రైల్వేకోడూరు అసెంబ్లీ టికెట్ ఆశ చూపించి టీడీపీ నేత వేమన సతీష్ తనను మోసం చేశారని పార్టీ నేత సుధా మాధవి సంచలన ఆరోపణలు చేశారు. తాను టికెట్ కోసం వేమన సతీష్‌కు ఏకంగా రూ. 7 కోట్లు ఇచ్చానని, ఆస్తులన్నీ అమ్మి ఈ మొత్తాన్ని సమకూర్చానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సుధా మాధవి మీడియా ముందుకు వచ్చి కన్నీటిపర్యంతమయ్యారు. తన వద్ద రుజువులు ఉన్నాయని పేర్కొంటూ, డబ్బులు ఇస్తున్న వీడియో క్లిప్పింగ్‌లను కూడా విడుదల చేశారు. “నా రేంజ్ ఏంటో, నా తాత ముత్తాతల ఆస్తి ఎన్ని కోట్లో చూపిస్తా” అంటూ ఆమె సవాల్ విసిరారు. రూ. 7 కోట్లు తీసుకున్న వేమన సతీష్ టికెట్ ఇప్పించకపోగా డబ్బులు అడిగితే బెదిరిస్తున్నారని సుధా మాధవి ఆరోపించారు.
ఈ వ్యవహారంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆమె పేర్కొనడం టీడీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తిరువూరు టికెట్ సహా పలుచోట్ల టికెట్ల విషయంలో ఆరోపణలు వస్తున్న తరుణంలో, సుధా మాధవి చేసిన ఈ ఆరోపణలు పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారాయి.


