తిరుపతిలో కూటమి పార్టీల మధ్య విభేదాలు బహిరంగ ఘర్షణలకు దారి తీశాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై జనసేన కార్యకర్తలు దాడి చేసిన ఘటన రాజకీయంగా కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు గాయపడగా, వారిని రుయా ఆస్పత్రికి తరలించారు.
గాయపడిన కార్యకర్తలను పరామర్శించిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో రౌడీ రాజకీయాలు నడుస్తున్నాయని, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ప్రశాంతతను భంగం చేస్తున్నారని ఆరోపించారు. బస్టాండ్ వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను వెంటనే విడుదల చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ దాడి వెనుక కుట్ర కోణం ఉందా అనే అంశంపై లోతైన దర్యాప్తు జరపాలని సూచించారు.
ఈ ఘటనతో తిరుపతిలో కూటమి పార్టీల మధ్య సమన్వయం ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ స్థాయిలో కలిసిపనిచేస్తున్నా, స్థానికంగా జరుగుతున్న ఇలాంటి ఘర్షణలు ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

